Friday, August 17, 2007

దూదేకుల కవిత్వం

ఏ కులమని నను వివరమడిగితేఏమని చెప్పుదు లోకులకూలోకులకు పలుగాకులకూదుర్మార్గులకూ ఈ దుష్టులకూ- …………………………………….ఇంటిలోపలను యిల్లు గట్టుకొనిమంటలోపల రాటం బెట్టుకకంటిలోపల కదురు బెట్టుకొనిముక్కులోపల యేకు బెట్టుకొనిచేతిలో బాక చేతికి తీసుకనారాయణ యను నరము తీసుకొనిఅష్టాక్షరియను తడిక వేసుకొనిపంచాక్షరి యను పంచదీసుకొనితకథిమ తకథిమ గుబదెబ గుబదెబఏకిన కులమే మా కులముఏకిన ఏరులు పీకిన పిందెలులోకమంతనొక పాపము జేసుకఏకిన కులమే నా కులము(దూదేకుల సిద్దప్ప తత్వం)
ఏ అవమానానికి ప్రతిగా చెప్పాడో, ఏ ప్రశ్నకు సమాధానమిచ్చాడో కానీ - సిద్దప్ప కులం గురించి ప్రశ్నలనెదుర్కొన్నాడని అవమానింపబడ్డాడని - మాత్రం దీనివల్ల అర్ధం అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మం వద్ద శిష్యరికం చేసిన సిద్దప్ప - కులమత అంతరాలను, విద్వేషాలను సామాజిక అసమానతలను తీవ్రంగా వ్యతిరేకించాడు. తన తత్వాలలోను, వచనాలలోనూ ఇదే విషయాన్ని బోధించాడు. ప్రచారం చేశాడు.దాదాపు మూడు శతాబ్దాల కిందట దూదేకుల సిద్దప్ప చెప్పిన తత్వం ఇది. ‘ ఏ కులమని నను వివరమడిగితే’ అనడంలో ‘మీదేకులం’ అని ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా సిద్ధప్ప చెప్పిన ఈ వాక్యం రెండు శతాబ్దాలు గడిచాక ‘మీదేకులమన్న ప్రశ్న’ వెలయించి చివాలున లేచిపోవుచో - బాకున కుమ్మినట్లుగున్’ అన్న జాషువా పద్యం కూడా ‘ ఇదే ప్రశ్నకు’ సమాధానం. అంటే రెండువందల ఏళ్ల తర్వాత కూడా సమాజం పరిస్థితిలో, నిచ్చెనమెట్ల వ్యవస్థలో ‘గౌరవాల’ స్థాయిలో ఏ మార్పూలేదని మనం అర్ధం చేసుకోవచ్చు.దూదేకుల సిద్ధప్పకు జాషువాకు ఎదురైన ప్రశ్నే మళ్లీ ఇరవయ్యో శతాబ్దపు చివర్లో మళ్లీ మద్దూరి నగేష్‌బాబుకూ ఎదురైంది. అందుకే నగేష్‌బాబు ‘మీరేవుట్లు’ కవిత వొచ్చింది.“మేం ఎవరిమైతే మీకెందుకంట?మేము ఏవుట్లమైతే మీకెందుకంట?మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది అరగదా?మా పుటకేందో తెలుసుకోకపోతే మీ తూరుపు తెల్లారదా?'’(మద్దూరి నగేష్‌బాబు - మేరేవుట్లూ…?)అంటే మారుతున్న కాలంతో పాటుగా ‘మీదేకులం’ అన్న ప్రశ్న పదునుదేరింది తప్ప పాతబడలేదు మాసిపోలేదు. ఆయాకులాలకు, ఆయా అవమానిత దళిత జాతులకు ప్రతినిధులుగా ఈ ముగ్గురు కవులు గొంతు విప్పారు. అంటే మొత్తం జాతి పొందుతున్న అవమానానికి, తలెత్తుకునే స్థితిలేని సామాజిక అణచివేతకు ఈ కవితలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.మనుషులంతా కులాలుగా, మతాలుగా, జాతులుగా విడిపోయి తప్ప కలిసి బతకలేని స్థితి భారతీయ సమాజంలో వుంది. ఇది ఈనాటిది కాదు. ఆర్యజాతి భారతగడ్డమీద అడుగుపెట్టినపుడు జరిగిన వేర్పాటు. ఈ కుట్రపూరిత వేర్పాటు వాదానిది ఊసరవెల్లి తత్వం. ఇది స్థానాన్ని బట్టి, కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తన ఉనికిని, స్వభావాన్ని మార్చుకుంటుంది. కాలంమారినా స్థితిమారినా స్థలం మారినా, మతం మారినా అంటరానితనపు ముద్ర దళితుల్ని వెంటాడుతూనే వుంది.శతాబ్ధాల కింద హిందూ, దళిత, బహుజనులు ఇస్లాంలోకి మతం మార్చుకున్నారు. అలా మతం మారడానికి ముందు వీరు నవారునేత, బట్టలనేత, గుర్రాలు కాయడం, పరుపులు కుట్టడం, గుంటమగ్గం నేత వంటి వృత్తులమీద ఇతర తక్కువహోదా కలిగిన కులవృత్తులమీద ఆధారపడి బతికేవారు, హిందూ అణిచివేత నుంచి వెలివేతలనుంచి బయటపడాలని కలలు గన్న వీరికి ఇస్లాం మతం కొత్త వెలుగులా కనిపించింది. ఆకర్షించింది. మతం మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఈమత మార్పిడివల్ల తమకేదో అద్భుతం జరగబోతుందని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. అణచివేత, అవమానం అలాగే మిగిలాయి. పెద్దమార్పులేదు.కొత్తమతంలో వీరంతా దూదేకులయ్యారు. అనుకున్నంత హోదా, గౌరవం దక్కక అయోమయస్థితిలో మిగిలిపోయారు.మతం మారిన తర్వాత వీరి రోజువారి జీవనంలోనూ, వేషంలోనూ, భాషలోనూ, ఆహారపు అలవాట్లలోనూ పెద్దమార్పులు చోటుచేసుకోలేదు. పూర్తి ముస్లింలుగా వీరిలో మార్పులు (ముస్లిమిసతిఒన్) జరగలేదు. గ్రామీణ ప్రాంతాల్లో సూఫీ ప్రవక్తల ప్రభావంతో దర్గాలకు, జెండా చెట్లకు మొక్కులు చెల్లించుకునే దళిత బహుజనులు అనేకమంది వున్నారు. ఒక్క ముస్లిం కుటుంబం కూడా లేని కొన్ని ఊర్లలో ఉర్సులు, పీర్ల పండగలు జరిపే దళిత బహుజన కుటుంబాలున్నాయి. అంటే మతం మారకపోయినా వీరు ముస్లిం సంప్రదాయాలను, ఆచారాలను పాటించడం చూడవచ్చు. హలాల్ చేయనిదే మాంసం ముట్టని దళిత బహుజనులూ వున్నారు. అయితే వీరు హిందువులుగా తమ మతంలోని ఆచారాలను పాటిస్తూ ముస్లిం - ఆచారాలనూ అలవరచుకున్నారు. దసరా పండుగ చేసినట్టే పీర్ల పండగనూ చేసుకుంటున్నారు.ఇదే స్థితి దూదేకుల్లోనూ ఉంది. అంటే సరళీకరించిన ముస్లిం ఆచార వ్యవహారాలను పాటించే దూదేకులు - హిందూ సంస్కృతి నించి కూడా పూర్తిగా బయటపడలేదు. అందుకే పీర్లపండుగనూ దసరాను దూదేకులు ఒకేరకంగా జరుపుకునే స్థితి ఉంది. నిజమైన ఏకత్వాన్ని, పరమత సహనాన్ని స్నేహభావాన్ని దూదేకుల జీవితం ప్రతిబింబిస్తుంది.దూదేకులకు భూమి, విద్య, సొంత ఆస్తి, సాంఘిక హోదా లాంటివేమీ లేవు. రెక్కల కష్టం మీద బతికే అట్టడుగు స్థాయి వర్గంగా, ముస్లిములలో రెండో తరగతి వారుగా దూదేకులు సామాజిక అణచివేతకు గురవుతున్నారు. దూదేకటం, పరుపులు కుట్టడం, నవారునేత, బ్యాండు సన్నాయి మేళం వాయించటం, సోడాలు అమ్మటం, టైలరింగ్, మెకానిక్ పనులు, వ్యవసాయ కూలీ వంటి సామాజిక గౌరవం దక్కని అల్పాదాయ వృత్తులపై ఆధారపడి బతుకుతున్నారు.చదువులోనూ, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ దూదేకులు వెనుకబడి ఉన్నారు. 1960 ల తర్వాత మొదటి తరం చదువుకోవటం మొదలుపెట్టింది. అయితే ఈ చదువులు వీళ్లను గుమస్తాలు, టీచర్ల స్థాయిని మించి ముందుకు తీసుకెళ్లలేదు. ఇంజనీర్లు, డాక్టర్ల వంటి వారు దూదేకుల కులంలో వేళ్లమీద లెక్కపెట్టొచ్చు. ఇక ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. స్థాయిలో ఒక్కరు కూడా లేరు. పారిశ్రామిక వేత్తలు, క్యాపిటలిస్టులు భూతద్దంతో వెదికినా దొరకరు. రాజకీయాల్లో జెండాలు మోసేవారుగా, ఉద్యమాలలో బ్యానర్లు కట్టేకవాళ్లుగా తప్ప పదవులకు, ప్రాతినిధ్యానికి వేల మైళ్ల దూరంలో వున్నారు.ప్రభుత్వం ఇచ్చిన బి.సి.’బి’ రిజర్వేషన్ కూడా దూదేకుల విద్యా, ఉద్యోగ, ఆర్ధిక స్థాయిలో పెద్దగా మార్పు తేలేకపోయింది. ముఖ్యంగా మిగతా బి.సి.లతో పోటీలో దూదేకులు వెనుకబడిపోక తప్పలేదు.బ్రాహ్మణీయ రచయితలు, సినిమా రంగం దూదేకులను పింజారీ వెధవలు చేసింది. ముస్లిం సమాజం వీళ్లను లథాఫ్‌లను చేసింది.ఇక తెలుగు సాహిత్యంలో దూదేకుల కవులు, రచయితలు పద్యరచనా కాలం నుంచీ వున్నప్పటికీ వారు సాధారణ బ్రాహ్మణీయ సాహిత్య వొరవడిలోనే రాయక తప్పలేదు. ఆధునిక కవుల్లో దిలావర్, ఖమ్రొద్దీన్, యాకూబ్ వంటి వారు తెలుగు కవిత్వంలో తమదైన స్థానాన్ని నిలుపుకున్నారు. అసలు సాహిత్యంలోకి ప్రవేశించే కవులుగా, రచయితలుగా నిలబడ్డమే కష్టమైన స్థితిలో సమకాలీన కవిత్వం రాసి తమదైన ముద్రను సాహిత్యంపై వేయగలిగారు. కానీ - స్వంత అస్థిత్వాన్ని మాత్రం సాహిత్యంలో ప్రవేశపెట్టలేకపోయారు.దళిత సాహిత్యంలో వివిధ కులాలు తమ ప్రత్యేక అస్థిత్వాల గురించి ప్రశ్నించడం మొదలైన తర్వాత - దూదేకులు కూడా తమ జీవన వాస్తవాలను సాహిత్యంలో ప్రతిబింబించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఇన్నేళ్లుగా సాహిత్య గౌరవానికి నోచుకోని దూదేకుల జీవితంలోని అనేక కోణాలను సాహిత్యానికి పరిచయం చేశారు.“ఏకుతున్న దూది పింజెలు పింజెలుగా విడిపోయిఅమ్మముఖం ముందు గాల్లో ఎగురుతుంటేచంద్రుని ముందు మబ్బుతునకలు తారట్లాడినట్లుంటుందిపత్తిచేళ్ల మధ్య దూదితీసిన పత్తిగింజైపోయిననా ముసలి తల్లికవానేలాడదీసి దారాన్ని లాగుతూ దూదేకుతుంటేనా నరాల్నెవరో వీణతీగలు చేసి మీటుకుంటున్నట్టుంటుంది'’(ఖాజా – మా…)1995 ఫిబ్రవరిలో వెలువడిన ఈ కవిత దూదేకుల కష్టాన్ని సాహితీ పటం మీద ఆవిష్కరించింది. దూదేకుల జీవితానికి, శ్రమకు సాహిత్య గౌరవాన్ని కల్పించింది.“పగిలిపోయిన సర్కారు దవాఖానా కళ్లద్దాల్లోంచి -వణుకుతున్న ముడతలు పడ్డ చేతులతో మా అమ్మచినిగిన చొక్కాలకు మాసికలూ - బొంతలకు అతుకులూ కుడుతుంటేనా గుండెకెవరో మిషను కుట్టేస్తున్నట్టుంటుందిపరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మకటికనేలమీదలా నడుంవాల్చి కునుకుదీస్తేకాబూలీవాడి అప్పు కల్లోకొచ్చిలాగిపెట్టి తన్ని లేపుతుంది.(ఖాజా – మా…)దూదేకులు సామాజికంగా, ఆర్ధికంగా దీనమైన స్థితిలో వున్నారు. శ్రమను నమ్ముకొని బతుకుతున్నారు. చాలీచాలని సంపాదనతో కనీసం మూడుపూటల తిండి దొరక్క దరిద్య్రాన్ని అనుభవిస్తున్నారు. అప్పుల పాలైపోయి బికారులుగా దిగజారిపోతున్నారు.ఈ పరిస్థితులను దూదేకుల కవిత్వం బలంగా వ్యక్తీకరించింది. ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా తమమీద కొనసాగుతున్న అణచివేతను ప్రశ్నించింది. ఇస్లాం మతంలో అసలు కులమే లేదని చెప్తూనే దూదేకులను తక్కువగా చూసే, ఎగతాళి చేసే ‘మోలీసాబ్’ల మోసాన్ని నిలదీసింది. తమ సాంస్కృతిక వెనకబాటును చూసి ఈసడించుకునే ‘ఛాందస’వాదులను - తమ పేదరికాన్ని చులకన చేసే నవాబులనూ దూదేకుల కవిత్వం కాలర్‌పట్టి నిలదీస్తుంది.సామాజిక - సాంస్కృతిక దృష్టిదూదేకుల కవిత్వం తమ సాంస్కృతిక - సామాజిక వెనకబాటును కవిత్వీకరించింది. ఒక సామాజిక సమూహంగా తమ అస్థిత్వ సమస్యను, ఒక కులంగా ఎదుర్కొంటున్న ప్రత్యేక సమస్యలను, మతంలోని వారిగా ఎదుర్కొంటున్న అవమానాలను దూదేకుల కవిత్వం ఎజెండా మీదకు తెచ్చింది.“చెబితే నమ్మరేమో కానీ చెప్పుకుంటే మీ ముందుపలచనై పోతామని భయంపెంటు సాబు, ఉద్దండు, దస్తగిరి, నాగులు, చిన ఆదాంలాలు, పెదమౌలా, చినమౌలా, షేకు శ్రీనివాసుబేతంచర్ల మొయిను, పాటికట్ట మల్సారు - ఇవే కదా మా పేర్లు'’.(యాకూబ్ - అవ్వల్ కలిమ)ముస్లిమీయతను పూర్తిగా సంతరించుకోలేక పోయిన దూదేకుల అంతర్మధనాన్ని ఈ కవితలో యాకూబ్ వ్యక్తికరించిన తీరు అద్భుతమైంది. ముస్లింలమని ఎంతో ‘గాంభీర్యం’గా చెప్పుకునే దూదేకులు, ముస్లింల నుంచి ఎదుర్కొనే వివక్షను బయటికి చెప్పలేక లోలోపలే దుఃఖిస్తున్నారు. హిందూపేర్లతో, హైందవ సంస్కృతిని ఆచరిస్తూ ముస్లింలుగా వుంటూ రెండు సంస్కృతుల మధ్యా నలిగిపోతున్నారు.“షేక్, సయ్యద్, పఠాన్ - మీ దర్పాల హోదాల ఖాందాన్లపేర్లుచెప్పి మమ్మల్ని దగ్గరికైనా చేరనిచ్చారా!లద్దాఫ్, దూదేకుల, కసాబ్, పింజారీ………వృత్తిని కులమై కరిచిన కాలపు గుర్తులమయ్యాం.'’(యాకూబ్ - అవ్వల్ కలిమ)భారతీయ కులసమాజపు ప్రభావంతో ముస్లిములు కూడా ఇక్కడ హెచ్చుతగ్గులుగా విడిపోయి వున్నారు. షేక్, సయ్యద్, పఠాన్‌లు అష్రాఫ్ (ఉన్నత వర్గం)గా చెలామణి అవుతుండగా లద్దాఫ్, నఫ్రూ, గొడారి, కాసి వంటి కులాలన్నీ అజ్లాఫ్ (కిందివర్గం)గా ఉన్నత ముస్లిం సమాజానికి దూరంగా - అంటరానివారుగా వుంటూ అవమానాలు ఎదుర్కొంటున్నారు.” ఈ లోకాకులన్నీ నన్ను ఏకాకిని చేసిఏకుల్లో తొక్కిస కథ యిదిమసీదుని నాలుగు గుమ్మటాలతో భాగించినట్లుఅందర్నీ పోగులుగా కలిపినేసిన మతం తానునిఎక్కువ తక్కువ ముక్కలుగా చింపినమను ముల్లాల సంగతి యిది.అందరూ సమానమేనని చెప్పిన అల్లాకళ్లలో కారం కొట్టినా నిచ్చెనమెట్లను తెగనరికినన్నో మరుగుజ్జుగా మలిచినమోసపు మోలీసాబ్‌ల నమ్మక ద్రోహమిది'’(ఖాజా - ఏకేకులం - 1)అల్లా ప్రతిపాదించిన ‘ఇస్లాం’ కులాలకు అతీతమైనది. అసమానత్వానికి, కులవ్యవస్థకు చోటులేని ఇస్లాంకు ఇక్కడి ముల్లాలు మనువాదులై కులజాడ్యాన్ని అంటించారు. అందరూ సమానంగా వుండాల్సిన చోటు కొందర్ని తక్కువ వాళ్లను చేసి అట్టడుగుకు నెట్టివేసిన ముల్లాలను, మనువులుగా పోలుస్తున్నాడు కవి.దూదేకుల్లో దేశం గర్వించదగిన కళాకారులున్నారు. ముఖ్యంగా నాదస్వర సామ్రాజ్యాన్ని ఏలిన షేక్ చినమౌలానా వంటి విద్వాంసులు, బుర్రకథా పితామహుడు నాజర్ వంటి కళాకారులు దూదేకుల కులం నుంచి ఎదిగిన ప్రముఖులు. నిజానికి దూదేకుల కులంలో నాదస్వర విద్వాంసులు అనేకమంది వున్నారు. ముఖ్యంగా దేవాలయాల్లో, పండుగలు, దేవుళ్ల ఊరేగింపుల్లో, పవళింపు సేవల్లో, మేల్కొలుపు సేవల్లో దూదేకుల విద్వాంసుల నాదస్వరాలాపన ఎంతో ప్రాముఖ్యత కలిగి వుంది. అదే సందర్భంలో వీరిపై అవహేళన, అణచివేతకూడా ఉంది.“నేను లేకుండానా మట్టికాళ్లీ గుళ్లలోకి నడవకుండానాజుమ్మా స్నానాల దూదేకుల కంపులేకుండానా ఎంగిలి పీకల సుప్రభాతాలు లేకుండాఇక్కడ ఏ దేవుడికీ కనీసం మెలకువైనా రాదువాడి పవళింపు సేవకోసంపాటను పన్నీటి జల్లును చేసింది నేనువాడి ఉత్సవ ఊరేగింపుల కోసంగాలి తిత్తినైరాగాల పరిమళంగా పరుచుకునేదీ నేనే'’(ఖాజా - ఎంగిలి పీక)డాబు కోసం, దర్పంకోసం దూదేకులు - ఉర్రూతలూగటం లేదు. ఇవాళ ఎలా గడుస్తుందోనన్న దిగులుతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఉర్దూ - అరబ్బీలు నేరవడానికి, ఐదుపూటల నమాజ్‌లకు అసలు అవకాశమే లేని స్థితిలో అస్లీ ముస్లింగా మారలేనందుకు దుఃఖపడాల్సిన అవసరమేలేదు.“నా దూదేకులతనాన్ని షోహర్ ఆపాదించుకోనప్పుడుఅస్లీ ముస్లిం ముద్రని మాత్రం నేనెందుకు భరించాలి?దారిద్య్రం నా కలల్ని - ఆకలి కాలాన్ని మింగేస్తుంటేదుఃఖ జంఖానాలో ఎక్కెక్కిపడ్డ నాబచ్‌పన్పరుపులు కుట్టడమే నేర్చుకుందినేర్చుకోలేని ఉర్దూ అరబ్బీల గురించినేనెందుకు దుఃఖించాలి'’(షాజహానా - లద్దాఫ్ని)ఆర్ధిక పేదరికంతో పాటుగా దూదేకుల్లో సాంస్కృతిక వెనుకబాటు తనం వుంది. ఈ వెనకబాటు కారణంగా వీరిలో, సగం ముస్లిమీయ సంస్కృతి సగం హిందూ సంస్కృతి ఉంది. వేషం, భాష, ఆచార వ్యవహారాలన్నింటిలో ఈ సంయుక్త సంస్కృతి కనిపిస్తుంది.ఈ దేశంలో నిజమైన లౌకికవాదులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్లు దూదేకులే. ఎందుకంటే ముస్లిం - హిందూ సంస్కృతుల సమ్మేళనంగా వుంటూ ఈ రెండూ మతాల మధ్య దూరాన్ని చెరిపేసేరు. ‘హిందూ - ముస్లిం భాయి భాయి’ అన్న నినాదం అస్లీ ముస్లింలకు, బ్రాహ్మణ హిందువులకు నినాదం మాత్రమే కానీ - దళిత బహుజనులకు, దూదేకులకు ఇదే జీవనసూత్రం అయింది. ఈ సూత్రమే గ్రామీణ ప్రాంతాల్లో వీరిని ఐక్యంగా వుంచుతుంది.ముస్లింలోనూ - హిందువుల్లోనూ ఉన్నత వర్గాలుగా, కులాలుగా అధికారాలను, హోదాను, గౌరవాలనూ అనుభవిస్తున్న వారికి ఈ సంయుక్త జీవన సూత్రం శత్రువైంది. అంటరానిదైంది. అందుకే దూదేకులు ముస్లింలలో కింది తరగతివాళ్లుగా మిగిలిపోయారు. దీన్నే దూదేకుల కవులు ప్రశ్నిస్తున్నారు.ఆర్థిక దృష్టిఆర్థిక దృష్టి కోణం నించి పరిశీలిస్తే దూదేకుల పరిస్థితి దళిత, బహుజనుల కన్న వందలరెట్లు దిగజారిపోయింది. తినటానికి, కనీసం కడుపునిండా తిండిలేక, ఉండటానికి ఒక గూడైనా లేక దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు. చిన్న చిన్న వృత్తులమీద ఆధారపడి చాలీచాలని సంపాదనతో బతుకును తప్పనిసరై అలా నెట్టుకొస్తున్నారు.ప్రపంచీకరణ నేపథ్యంలో చేతివృత్తులకు, చిన్న పరిశ్రమలకు కనీసం నిలువనీడలేక పోయింది. ముఖ్యంగా కాయర్ పరిశ్రమ దేశవ్యాప్తంగా వున్న పరుపుల మార్కెట్‌ను ఆక్రమించగా కులవృత్తిగా దూది ఏకి పరుపులు కుట్టే దూదేకులు ఇవాళ పైసా సంపాదన లేక దిక్కులేని వారుగా నడిబజార్లో నిలబడ్డారు. దుర్భరమైన పేదరికంతో, ఆకలితో అలమటిస్తున్నారు.“సెంచురీ నా కంచంలోంచి అన్నం ముద్దని తన్నుకుపోయిందిపాలిష్ట్ స్పాంజి పిల్లోనా గొంతుమీద తన సుతిమెత్తని చేతులుంచి నులుముతుందినా ఊపిరిచుట్టూ ఒక ఉచ్చుదేశ సరిహద్దుల్లో పాతిన ముళ్ల కంచెలా బిగుసుకుంటుంది.నైపుణ్యం నిండిన నా చేతివేళ్లమీదఒక విదేశీ ఫోమ్ పాదం నాడా బూట్లతో నృత్యం చేస్తుందిపగలని పత్తికాయలానా కవాను తీగల్లో ఒక అత్యాధునిక అపశృతిపంటికింద పలుకురాయిలా తగులుతుంది’(ఖాజా - నరం తెగిన కవాను)ఎన్నో తరాలుగా నమ్ముకున్న వృత్తి ఇవాళ ఎందుకూ పనికిరాకుండా పోయింది. విదేశీ కాయర్ ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించేశాయి. దూదికి, దూదిపరుపులకు విలువ లేదు. కొనేవారు లేరు. సామ్రాజ్యవాదం కొట్టిన ఈ చావుదెబ్బకు దూదేకులు కకావికలమయ్యారు. కనీసం రెండుపూటలా తిండి కూడా దొరకని స్థితిలో మరింత పేదరికంలోకి జారిపోయారు. అయినా ఇది ఎవరి దృష్టికీ రాలేదు.దూది పరుపులకు మార్కెట్‌లో కాలం చెల్లిపోయినట్లే, గోళీసోడాలకూ కాలం చెల్లింది. సోడాలమ్ముకొని బతికే దూదేకుల సాయెబులను, కిన్‌లే, బిసిలరి, లెహర్‌పెప్సీ సోడాలు చావుదెబ్బకొట్టాయి. ఇక టైలరింగ్ పనిచేసేవారిని ‘రెడీమేడ్’ తొక్కేసింది. మొత్తం నమ్ముకున్న వృత్తులన్నీ ప్రపంచీకరణ దెబ్బకు నిల్వలేకపోగా- దూదేకులు పొట్ట చేతపట్టుకుని కొత్త వృత్తులను వెతుక్కుం టున్నారు. వ్యవసాయకూలీలుగా, తాపీపనివాళ్లుగా, రిక్షా, ఆటో రిక్షాతోలే వారిగా, డ్రైవర్లుగా కొత్త అవతారాలెత్తుతున్నారు.“నిన్నటి దాకానాచీనీ పళ్లెంలో అన్నం ముద్దైన తెల్లదూదిఇవాళ నాకళ్లలో ఘనీభవించిన తెల్లపోరైందినాబతుక్కొక ఆమీ అయిన ఊతకండెపాతడబ్బాల్లా నన్ను సాచి తన్నిందిసుతిమెత్తని దూదేకిన చేతులతోనేఇప్పుడు సుతారి పనిలో గమేలా మోస్తూ -అందమైన చమ్కీ పరుపులు కుట్టిన చేతులతోనేఇప్పుడు ఇటుకలు పేర్చిమట్టిపోసీ దిమ్మెస కొడుతూ -(ఖాజా - నరం తెగిన కవాను)ఇక చదువుకున్న వర్గం వాళ్లలో అధికభాగం టీచర్లుగా ఎదుగుతున్నారు. అక్కడక్కడా చిన్న ఉద్యోగాల్లో కొందరు స్థిరపడుతున్నా చదువుకున్న వారిలో కూడా ఎక్కువమంది ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. లేదా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొంటున్నారు.మొత్తంగా దూదేకుల సంఖ్య రాష్ట్రంలో 50 లక్షల వరకూ ఉండగా ఆర్థికంగా అత్యంత దుర్భరమైన స్థానంలో వున్నవారు 90% పైమాటే. అందుకే దూదేకుల కవులు తమ ఆర్థిక దుస్థితిని, ప్రపంచీకరణ కారణంగా దిగజారి పోతున్న దూదేకుల దౌర్బల్యాన్ని ప్రశ్నిస్తున్నారు. కవిత్వీకరిస్తున్నారు.దూదేకుల స్త్రీల దృష్టిముస్లిం స్త్రీలు మతపరంగా దుర్భర స్థితిలో వుంటే దూదేకుల స్త్రీలు మతంతో పాటు కులపరంగా కూడా దుర్భరస్థితిని ఎదుర్కొంటున్నారు. ముస్లిం స్త్రీలు ముస్లిం పురుష సమాజం నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదు ర్కొంటూ, హిందూమతం నుంచి ఛీత్కారాలను, దాడులను ఎదుర్కొం టున్నారు. కాగా దూదేకుల స్త్రీలు ముస్లిం సమాజంలో స్త్రీ పురుషుల నుంచి వివక్షనూ, అణచివేతనూ ఎదుర్కొంటూ హిందూ సమాజం నించి అవమానా లను ఎదుర్కొంటున్నారు.“పరుపులు కుట్టీ కుట్టీ అలసిపోయిన అమ్మకటిక నేలమీదలా నడుం వాల్చి కునుకుదీస్తేకాబూలీ వాడి అప్పు కల్లోకొచ్చి లాగిపెట్టి తన్ని లేపుతుంది'’(ఖాజా – మా…)అంటరానితనం మినహా మూడురూపాయలు అప్పుకట్టలేక అవమానించబడ్డ మహదేవమ్మకు, దూదేకుల తల్లులకు పెద్ద తేడాలేదు. పేదరికం, అవమానం రెండిట్లో ఏదిముందో - ఏదివెనుకో తెలియదు గానీ దూదేకుల స్త్రీలను ఈ రెండూ కలిసి మరింత లోతుకి తొక్కేస్తున్నాయి.దూదేకుల స్త్రీలు రీతి రివాజులు తెలియని వారుగా, ఉర్దూ రాని వారుగా, ఖురాన్ తెలియని వారుగా ముస్లిం సమాజం నుంచి అవమానించబడుతున్నారు.“కానరాని అశక్తతతో కళ్లెమైనా నోటిని బిగించి పట్టుకుంటుందిరెప్పల కొమ్మల్లోంచి వీచిన వాళ్ల సుడిగాలుల చూపుల్లోనేనో దూదిపింజనై హాలు హాలంతాఉన్నచోటి నుంచే గిరికీలు కొట్టబడతానువచ్చోరాదో - నా ఉర్దూ పరిజ్ఞానం మీదవాళ్ల కుతూహలాల ప్రావీణ్య ప్రదర్శన జరిగిముఖాల్లో పరిహాస ఫలితాల తేల్చేసాకతెగించి - బయటకు రాలేని మొహమాటపు నీటిచుక్కలుకంటికోనల్లో ఇరుక్కుని అచ్చం నాలాగే అల్లాడతాయి'’(షాజహానా - లద్దాఫ్ని)దూదేకుల స్త్రీల దుస్థితి ఇంతదాకా సాహిత్యం పట్టించుకోలేదు. సమాజానికి దూదేకుల్ని పట్టించుకునేంత పెద్ద మనసూలేదు. జ్ఞానమూలేదు. ఇటు ముస్లింల నుంచి అటు హిందువుల నుంచి, పురుషుల నుంచి దూదేకుల స్త్రీలు తక్కువగా, చులకనగా చూడబడుతున్నారు. చదువులేక, విజ్ఞానం లేక, మారుతున్న సమాజాన్ని అర్థం చేసుకోలేక వెనకబడిపోతున్నారు.మొత్తంగా దూదేకుల సమాజం, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల న్నిటి మీద ఐక్యంగా పోరాడాల్సి ఉంది. తమ మూలాలను సంస్కృతిని ప్రతిబిం బించే సాహిత్య సృజన చేయాల్సి వుంది. దూదేకుల కవిత్వానికి ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఖాజా, యాకూబ్, షాజహానా, యండి యాకూబ్‌పాషా, దిలావర్ వంటి కవులు ఈ కోణపు కవిత్వానికి, సాహితీసృజనకు వాకిలి తెరిచారు. ఈ దిశలో మరింత మంది దూదేకులు తమ ప్రత్యేక అస్థిత్వాన్ని చాటుకునేందుకు, చరిత్రను నిర్మించేందుకు కవిత్వం రాయాల్సి ఉంది. భవిష్యత్తు సాహిత్యం దూదేకుల జీవన మూలాలను, సంస్కృతిని ప్రతిబింబిం చాల్సి వుంది.

10 comments:

vrdarla said...

ఖాజా గారూ!
తెలుగు బ్లాగులోకానికి స్వాగతం!!
ఇకపై ఇంటర్నెట్ లో కూడా ముస్లింసాహిత్యం బలంగా రాబోతున్నదన్నమాట!
మీ కవితలన్నీ సాధ్యమైనంత త్వరగా బ్లాగులో పెట్టండి.
మీ
దార్ల

Khajapoet said...

డియర్ దార్ల
థ్యాంక్యూ వెరీమచ్!
ఈ మధ్యనే బ్లాగును ప్రారంభించా.నిదానంగా ఒక్కొకటి చేరుస్తాను
బ్లాగుల ప్రపంచానికి నేను కొత్త. పైగా ఈ తెలుగు టైపు చేయడాం పెద్ద కష్టంగా వుంది..
అయినా ప్రయత్నిస్తా ...!

మీ
ఖాజా

Bolloju Baba said...

ఖాజా గారికి
నెను మీ కవితలు తారసిల్లినపుడల్లా వ్యాక్యాలలో ఎంఉందో కాక వ్యాక్యాల వెనుక ఏముందో అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తాను.

ఇలా ఈ విధంగా ముమ్ములను కలుసుకుంటూ ఉంటానని ఆశిస్తాను.

మీ అభిమాని
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/

Nrahamthulla said...

ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు. ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వేటపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం. ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది? ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.

Bolloju Baba said...

very interesting points.

expecting to know answers

విజయవర్ధన్ (Vijayavardhan) said...

>> "రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది."

మంచి (logical point) విషయం చెప్పారు.

>> ఆ మానవతా మతమేది?

కళలు, సాహిత్యం ఆ మతాన్ని సృష్టించడంలో ఎంతగానో తోడ్పడతాయని నా నమ్మకం.

Anonymous said...

Muslim dudekulu.. Christian dudekulu.. undaremonani doubt.. endukante, they don't follow the caste system in their religious practice.

If am not wrong they are treated as Hindu's and they are classified as BC and they are eligible for reservation given by the government.

నాగప్రసాద్ said...

నాకు తెలిసి, దూదేకులను హిందువులుగానే భావిస్తారు. వాళ్ళని ముస్లింలుగా చూసినట్టు, నేనెప్పుడూ ఎరగలేదు. అసలు ఈ బ్లాగ్‌లోకంలోకి రానంతవరకు, దూదేకుల అనేది కూడా హిందూ సంస్కృతిలోని మిగతా కులాల్లాగే, ఇదీ ఒక కులం అనుకునే వాణ్ణి. మా ఊళ్ళోని ప్రజలు కూడా వాళ్ళని హిందువులుగానే భావిస్తారు.

వాళ్ళ కట్టూ, బొట్టూ ఆచారాలన్నీ హిందువులుగానే ఉంటాయి కాబట్టి, వాళ్ళు హిందువుల క్రిందికే వస్తారు. అందుకేనేమో, వాళ్ళకి రాజ్యాంగం BC Reservation కల్పించింది. ఒక్క పేర్లు మాత్రం కొంచెం తేడాగా ఉంటాయి. అట్టాకాకుండా, ఇప్పటి నుంచి వాళ్ళు కూడా హిందువుల దేవుళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టుకుంటే సరి. కాలక్రమంలో వాళ్ళ తర్వాతి తరం వారు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు.

కెక్యూబ్ వర్మ said...

మీ కవిత్వంతో పరిచయం వుంది. మీ కవితా సంకలనం వచ్చిన కొత్తలో పదే పదే చదివి యానాం రాం నేను మాతాడుకునే వాళ్ళం. దూదేకుల కులం గురించి సమగ్రమైన విశ్లేషణను అందించారు. ఈ నిచ్చెన మెట్ల వ్యవస్తలో నేడు ప్రతీది సరుకుగా మారుతున్న కాలంలో పేర్లు మార్చుకున్నా ఆ వివక్ష కొనసాగుతూనే వుంటుంది. కులం ద్వారానే మతంలో కుడా గుర్తిమ్పునిస్తున్నారు ఇక్కడ, మరి ఏ మతంలో చేరినా అది తప్పదు. ఏభై లక్షల జనాభా కలవారు నిజంగా ఏకతాటిపై నిలబడి తమ హక్కులకోసం పోరాడితే కొంతైనా సాధించవచ్చు. ఐక్యంగా పోరాడితేనే తప్ప ఏది లభించదు. కవిత్వంతో పాటుగా న్యాయమైన హక్కుల కోసం నాయకత్వం వహిస్తే బాగుంటుంది భయ్యా. నా బ్లాగు లింక్ http://www.sahavaasi-v.blogspot.com/

Kathi Mahesh Kumar said...

చాలా విలువైన సమాచారం. అత్యంత విలువైన ప్రశ్నలు. వీటికి సమాధానాలు ప్రస్తుతం లేకున్నా,జరగాల్సిన/జరుగుతున్న చర్చలు సమాధానాల దిశగా ఖచ్చితంగా సహాయకారి అవుతాయి.