Sunday, July 1, 2007

సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం

ఖాజా
సారీ అంబేద్కర్! మేం వాడ దాటేశాం


రింగా రింగా రోజెస్‌ల
వినూత్న ప్రపంచావిష్కరణ జరిగిపోయాక
జేబుల్నిండా రంగు కాగితాల రంగవల్లులు నిండిపోయాక
ఇళ్ళలో కొత్తగా హైబిడ్ తులసిమొక్కలు అంటు కట్టుకున్నాక
తెగిపడిన తాతల నాలుక సాక్షిగా
కార్పొరేట్ కాలేజీలోపిల్లలకు సంస్కృతాన్ని సెకండ్ లాంగ్వేజిగా పెట్టి గర్విస్తున్నాక

విదేశీ ఇజాలకు భుజాలు అప్పగించిన బోయీలై
పెరటిచెట్ల వైద్యాన్ని
కార్పొరేట్ జార్ల పేటెంట్లకు తాకట్టు పెట్టేశాక

మొద్దుబారిన సిలుం కొడవళ్ళతో
ములకులిరిగిన దిగుమతి పెన్నుల్తో
నూత్న ప్రపంచావిష్కరణ కోసం
కోవర్టుల కొత్త వేషం వేసుకున్నాక

నువ్వు లాక్కొచ్చిన బండి రెండు చక్రాలూ
పట్టాలుతీసేసి- ఇరుసులు విరిచేసి
ఎప్పటికీ కలిసి నడవలేని వేరుకుంపట్ల నిప్పుకు
తలా కొంచెం నూనె గానుగాడించి పోసేశాక

-సారీ బాస్! వెనక్కి తిరిగి చూసుకునే అలవాటు లేదు!

వాడల్లో జనం వూర్లోకి జరుగుతున్న కొద్దీ
కులషితమైపోతున్న ఊళ్ళన్నీ
గిరిగీసుకున్న గేటెడ్ కమ్యూనిటీలుగా
డూప్లెక్స్ కలోనియల్ కౌంటీలుగా
తలా కాళ్ళూ చేతులూ
సంస్కృతి చిప్పలోకిసప్పున లాగేసుకుంటాయి

నోకియా గాలిపడవల మీద
లోకమంతా తిరిగొస్తున్న సూర్యుడు
కాలము-దూరము-వేగము సూత్రాన్ని
తీగల్లేని తంబురా మీద
కొత్త రింగ్‌టోనై ఆలపిస్తుంటే

- సారీ బాస్! దేబిరింపులూ, జాలికబుర్లూ వినే తీరిక లేదు!

గోడవతల గొడవల గురించీ
చిలుంపట్టిన సంకెళ్ళ గురించీ
అరిగిపోయిన ఆరెల గురించీ- గుర్తు రాదు

మాంశారం జంతులక్షణమనీ
పచ్చికాయలూ- ఆకులూ- అలములే మంచివనీ
మంతెన వంతెనెక్కి ఊళేసే నక్కల జాబితాలో
కొత్తగా పేరు నమోదు చేసుకున్నాక
వాడ గుడిసెల మీద ‘కొక్కొరోకో’లకు కొత్త అర్థాలు పుట్టుకొస్తాయి.

సారీ బాస్! నువ్వేం చేయలేకపోయినావన్నదే ప్రశ్న…
మేం ఏం చేశామో మాత్రం ఎవ్వరూ అడగడానికి వీల్లేదు.

ఏ చెట్టు కర్రల్ని
ఏ రంగు జెండాలకు తొడిగామో
ఏ చేను పంటల్ని
ఏ సంచులకెత్తి పంపామో
ఏ ఇంటి ఉప్పు తిని
ఏ వంతపాట పాడామో
ఎవ్వరూ ప్రశ్నించడానికి వీల్లేదు

బానిస సంకెళ్ళ కాలంలోంచి
బయటపడని వాడల గురించి దిగులు లేదు
ఓటమిలో కూరుకుపోయిన
పూట గడవని బతుకుల గురించి బెంగ లేదు

సారీ బాస్!
ఇవాళ మేం
పాష్ కాలనీలో
పాలిష్డ్ జీవితంలో
పేరు మార్చుకున్న పేతురులం
సంగదాసు వారసులం
శాంతి కాముకులం
ఓటమి ఎరుగని విజేతలం…
......కాకుంటే- ఊళ్ళో కాదు.

3 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

ఖాజా గార్కి

అభినందనలు
ఈ కవిత గురించి మీతో మాట్లాడినవి వెంటనే గుర్తుకు రావడంలేదు,
తీరికచేసుకుని రాస్తాను

జాన్‌హైడ్ కనుమూరి said...

కవిత బాగుంది అని సులువుగా చెప్పడం కంటే చాల చర్చకు పెట్టాల్సిన అంశాలు వున్నాయనిపిస్తుంది.
ఎటు వైపు అనే ప్రశ్న అన్నివిషయాలలోనూ కనిపిస్తుంది.
ఇంగ్లీషును ప్రేమిస్తూ ప్రేమిస్తూ కొత్తరకపు బ్రాహ్మణ్యాన్ని ఆశ్రయిస్తూ, విదేశ సిద్దాంతాలలోకి పారిపోతున్న స్తితి....

పోరాటాలనుంచి ఏదో
పరిష్కారమో విముక్తో దొరుకుతుందనుకుంటే అది ఏ తీరంలోవుందో అనే స్థితిలో.........

అవసరంగానో హఠాత్తుగాను లాకొచ్చిన దళిత పోరాటం రెండుగా చీలిపోవటం వెనుకవున్న శక్తుల వునికినికి ఎలా అర్థంచేసుకొవాలో అంతుచిక్కని పరిస్తితుల్లో..........
ఆదునికత ఇచ్చే కొత్తకొత్త వసతుల మద్య ఊరును తోసిపుచ్చే, మరిపించే కొత్త రింగు టోన్ల మార్కెట్ మయాజాలపు స్తితిలో.......
ఎవరు పనిచేసారో
ఎవరు పాత్ర ఎంతో ప్రశ్నించలేని స్తితిలో......

మనతొనేవుంటు మనమెవరమొ తెలియదనే పేతురులు.....
మనమద్య కొత్తదనాన్ని మోసుకు వస్తున్నామని చెప్తూ ఇంకా బానిసలుగా మర్చే సంగదాసులూ ... మనతోనే వుంటున్న స్తితిలో ....

కవిత బాగుందని కాకుండా
అంశాలను మాట్లాడవలసిన సమయం
అంశాలను చర్చించాల్సిన సమయం

ఈ సమయాల్ని సరిగ్గా గుర్తుచేస్తున్న ఖాజా కు అభినందనలు

Khajapoet said...

డియర్ జాన్
మీ అభిప్రాయం ప్రకటించినందుకు ధన్యవాదాలు. నిజంగా ప్రస్తుత గ్లోబల్ సందర్భంలో పూర్తిగా రైట్, లేదా పూర్తిగా లెఫ్ట్ భావాలుగానీ సరిపోతాయా, వివిధ వుద్యమాలు, సిధ్ధాంతాలు వీటిని ఎలా అర్థం చేసుకుంటున్నాయి. మీరన్నట్టు వీటి మీద సుదీర్ఘమైన చర్చ జరగాల్సివుంది