Saturday, November 24, 2007

నా కొక ఖిబ్లా కావాలి

ఖాజా
అలా…
వెతుకుతూ ఎంత దూరమైన వెళ్లూ
నీకంటూ వారసుడొక్కడూ దొరకడు
దువా దోసిట్లోంచి జారిన నమ్మకం
వాడి చేతిలో కొత్తరకం ఆయుధమై
నిగనిగ మెరుస్తుంటుంది

నీ లాగే
ఈ భూమికీ సొంతమైందేదీ లేదు
చెట్లు - మొక్కలు - కొండలు - నీళ్లు - పువ్వులు
ఎవరి పేరు మీద రాయబడ్డాయో
ఎవరి కబ్జాలో కట్టుబడ్డాయో
ముక్కలు ముక్కలుగా పంచుకున్నదెవరో
పొక్కిలైన ఇసక గుండెల
మీదయుద్ధ టాంకరై నడిచి వెళ్లేదెవరో!

అంతరిస్తున్న పంటల మీద
ఆక్రమణకు గురవుతున్న నేల మీద
విస్తరిస్తున్న రోడ్లమీద
మొలుచుకొస్తునన సిమెంటు గుట్టలమీద
రహస్యంగా ఎవడి రాజముద్రలున్నాయో!

అచ్చంగా నీకులాగే
ఈ భూమికీ సొంతమంటూ ఏదీలేదు
పక్షులూ - జంతువులూ - మనుషులూ
నల్లవాళ్లూ - నంగిరివాళ్లూ - నీడలేనివాళ్లూ - నోరులేనివాళ్లూ
పరదేశులుగా ప్రచారమైనవాళ్లూ -

ఎవడి నసీబులోనూ
వెలుతురుకు తావులేదు!

ఎన్ని ఆలోచనలు సంఘర్షించినా
అంతరంగంలో అందరూ బానిసలే
అడ్డా లేబర్‌ లాంటి వీసా అంగడిలో
అమ్మకానికి సిద్ధమైన సరుకులే!

నిజంగా
ఈభూమికీ సొంతంగా మిగలబోయేదేదీ లేదు
పడమటి మేఘాలు
గొడ్జిల్లా నోళ్లతో భూమిని మింగుతుంటే
ఎంత దూరం పరుగెత్తినా
కనిపించని వలల ‘నెట్‌వర్కింగు వేట’
ఫైర్‌వాల్స్‌లేని మూడో ప్రపంచాన్ని
వైట్‌ హౌస్‌ వైరస్‌ సరికొత్త పేర్లతో కాటేస్తూనే వుంది!

స అసం
నాకిప్పుడు
కొత్త ఖిబ్లా కావాలి
అందులో
ఏక ధృవ ప్రపంచాన్ని కలగుంటున్నవాడు
ఏకాకిగా మిగలాలి